Tuesday, 2 October 2012

ఓ బాపు ఫీల్ మై లవ్

ఇద్దరు మహానుభావులు

ఈ రోజు ఇద్దరు మహానుభావుల పుట్టిన రోజు . ఒకరు ఎవరు గుర్తుంచుకొని ఎవరు పట్టించుకోని లాల్ బహుదూర్ శాస్త్రి (శ్రీ కప్పగంతు శివరామ ప్రసాద్ గారు జ్ఞాపకము చేసుకున్నారు). నిజానికి అదే ఆయనకు మనము అర్పించే నివాళి . కాబట్టి ఈయన అదృష్టవంతుడే . 

రెండవ వ్యక్తి అందరు గుర్తుంచుకునే అందరు పట్టించుకునే  మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. అదే ఆ కరం చంద్ యొక్క ఖర్మ. అసలు ఇది నేను ఎందుకు రాస్తున్నానంటే నిన్న జరిగిన సంగతి తెలియాలి.

రేపు గాంధీ జయంతి మాంసపు కొట్లు ఉండవు కాబట్టి ఈ రోజే వెళ్లి తీసుకురమ్మని నా భార్య అంది. రోజు రాత్రి తొమ్మిది గంటల దాకా తెరచి ఉండే కొట్లు నిన్న ఆరున్నర ఏడు లోపలే మూసేశారు. ఒకటి రెండు కొట్లు తెరిచి ఉన్నా అవి మాంసము అమ్మివేసి శుభ్రం చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే రేపు గాంధీ జయంతి కాబట్టి మాంసపు కొట్లు ఉండవు . కాని రేపు శలవు దానిని ఆనందముగా జరుపుకోవాలంటే మాంసము కావాలి. కాబట్టి రేపటి పని నేడే చెయ్యాలి అనే సూత్రం సరిగ్గా అమలు చేయబడినది. కాబట్టి మద్యానికి కూడా ఈ సూత్రము అమలు చేయబడి ఉంటుందనుటలో సందేహమేలా! గాంధీ మీద గౌరవముతో ప్రభుత్వము ఈ నిషేదము చేసినది, కాని చిత్త శుద్ధి లేని శివ పూజ లేల అనే చందంగా మారినది.నిజముగా ఈ దినము ఎంత మంది భారతీయులు ఈ నియమమును శ్రద్దగా పాటిస్తున్నారు? ముఖ్యముగా రాజకీయ నాయకులలో ఎంతమందికి చిత్తశుద్ది ఉన్నది, మరి ముఖ్యముగా గాంధీ మా పార్టీ వాడే అనే  కాంగ్రెస్ వారిలో ఎంత మంది నాయకులు , ప్రజా ప్రతినిధులు మరియు మంత్రులు ఈ రోజు మధ్య మాంసములను  ముట్టుకోకుండా ఉంటారు? అలాంటప్పుడు ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వడము ఎంత వరకు సమంజసము? పాపము వామ పక్ష నారాయణ ఒక్కడే అని అనుకుంటారు ఆయన దొరికిపోయి ఒప్పుకున్నాడు వీళ్ళు ఒప్పుకోరు. అంటే తేడా!


నేను దీనికి వ్యతిరేకిని కాదు , కాని ఈ ఒక్కరోజు నిషేధం నిబద్దతతో పాటించే లాగ ప్రజలను పురిగొల్పుటలో ప్రభుత్వానికి అసలు శ్రద్ధ లేనేలేదు. కొద్ది మంది గాంధీ నిజమైన అభిమానులు మాత్రమే చిత్త శుద్ధి తో పాటిస్తారు, మరి కొద్ది మంది అంతరాత్మకు భయపడి మానేసి ఉంటారు. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? వారి శాతం ఎంత? ఒక్క సారి ఆలోచించండి?

నీతులు చాలా బాగున్నాయి , మరి నీ సంగతి ఏమిటి ? నిన్న నువ్వు ఎందుకు వెళ్లావు? నీకు దొరకలేదనే అక్కసు తోటేగా ఈ సోది  అంటారా? నేను వెళ్ళింది మా కోసం కాదు మా క్వీని కోసము . పెంపుడు కుక్కలకు స్వతంత్రం ఉండదు , స్వాతంత్రం లేని వాటికి గాంధీ విలువ ఏమి తెలుసు? శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంలో ఊర కుక్క " ఒరేయ్ నల్లోడా నువ్వు జాతి కుక్కవే గాని మా ఊర కుక్కల్లా నీకు స్వతంత్రం లేదురా " అని అంటుంది . అయినా స్వతంత్రం విలువ గాంధీ విలువ తెలియని అది కూడా ఈ రోజు పెడిగ్రీ బిస్కట్లు తిన్నది.



కాని ఒక్కటి మాత్రమూ నిజము, భారతీయుల హృదయాలలో గాంధీ అంటే జాతిపిత బాపూజీ నిరంతరమూ ఉంటారు. ఎక్కువ మంది ప్రేమతోటి అభిమానము తోటి ఆయనను హృదయములో ఉంచుకుంటే, కొద్దిమంది  స్వార్ధముతో (రాజకీయ) ఆయనను హృదయములో ఉంచుకున్నారు. మరి కొద్ది మంది ద్వేషం తోటి ఆయనను తమ హృదయములో ఉంచుకున్నారు.

ప్రేమ తో అభిమానముతో ఉన్నవారు ఈ రోజు గాంధీ గురించి కొన్ని మంచి ఆలోచనలను చేసి కనీసం ఇప్పటి  నుండి అయినా ఆయన ఆశయాలను పాటిద్దామని అనుకుంటారు. స్వార్ధముతో ఉన్నవారు ఉపన్యాసాలు దంచుతారు. ద్వేషం తో ఉన్న వారు విషాన్ని చిమ్ముతారు.


ప్రేమ చేత అయితే ఏమి, మిష చేత అయితే ఏమి ,క క్ష చేత అయితే ఏమి ఓ బాపు నీవు నిరంతరం మా హృదయాలలో ఉన్నావు. కాబట్టి మా ఆధునిక లవ్ గురు ఆర్య చెప్పినట్లు ఫీల్ మై లవ్ .

Thursday, 13 September 2012

నిశ్చితార్ధం తర్వాత

నిశ్చితార్ధం తర్వాత 


ఆమె : దీని కోసం ఎంత కాలం ఎదురు చూసానో.
అతడు : నేను నిన్ను వదిలి వెళ్లాలని కోరుతున్నావా?
ఆమె: లేదు లేదు
అతడు: నీవు నన్ను ప్రేమిస్తున్నావా?
ఆమె: అవును
అతడు: నువ్వు నన్ను మోసం చేస్తావా?
ఆమె: దాని కంటే నేను చావడం మేలు 
అతడు: నన్ను ముద్దు పెట్టుకొవా?
ఆమె: తప్పకుండా . అది నాకు ఎంతో సంతోషం 
అతడు: నువ్వు నన్ను బాధ పెడతావా?
ఆమె: నేను అలాంటి దానిని కాదు
అతడు: నిన్ను నమ్మ వచ్చా?
ఆమె:  ఆ 
అతడు: ఓ ప్రియా 
పెళ్లి అయిన తర్వాత ఏమైందో ఒక్క సారి తిరగేసి చదువుకోండి 
(ఎక్కడో చదివిన ఇంగ్లీష్ జోక్ కి తెలుగు అనువాదము)

Friday, 29 June 2012

బతకలేక బడి పంతులు

బతకలేక బడి పంతులు 
స్కూల్ లు మరల తెరిచారు , మొన్న హైదరాబాద్ లో , ఈ రోజు కలకత్తా లో టీచర్ ల పైశాచికత్వం బయట పడింది. వీళ్ళ ముందు సినిమా విలన్లు , యమ భటులు బలాదూర్. అమ్మ గార్ల అకృత్యాలు అయ్య గార్ల అఘాయిత్యాలు చూస్తుంటే పిల్లలను ముఖ్యముగా ఆడపిల్లలను చదువు మానిపించడము అంత శ్రేష్ట మైన పని మరొకటి లేదనిపిస్తుంది ( స్త్రీలు నన్ను  క్షమించుగాక ). 
గురువుని బ్రహ్మ గా పూజించే దేశంలో ఈ గురువులను ఏమి చేయాలి? ఇది నిజంగా ప్రతి ఇంటిలో ఉన్న సమస్యే , కాబట్టి దీని గురించి మనము తీవ్రంగా ఆలోచించాలి.

ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనే వారు, ఇప్పుడు బ్రతకనివ్వని వాడు బడిపంతులు అన్నట్లు ఉన్నది. దీనికి పరిష్కారం ఏమిటి?

Wednesday, 23 May 2012

పినాకి లారా ఆలోచించండి


తెలిసినట్లుగానే మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగాయి.

 పెట్రోల్ బంకుల ముందు క్యూలు పెరిగాయి.




 పనిలో పనిగా ట్రాఫిక్ జాములు గూడా పెరిగాయి. 

ఇది ఈ సాయంత్రం వీధులలో పరిస్థితి. ఇది అంతా మనకు అవసరమా? 

ఒక్క సారి ఆలోచించండి. మనము వృధాగా ఎంత పెట్రోల్ వేస్టు చేస్తున్నాము, ఇలా పెరిగినప్పుడు ఆ క్యూలలో గంటలకొద్దీ పోరాడి నాలుగు లీటర్ల పెట్రోల్ పోయించుకుని ఏమి సాధిస్తున్నాము. నిజంగా అత్యవసరము ఉండి తొందరగా వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది ఎంత ఇబ్బంది. 


1) ఒక మోటారు సైకిలు యజమాని ఎంత పెట్రోల్ కొట్టించు కుంటాడు, మహా అయితే ఐదు లీటర్లు 5 X 7 = 35 రూపాయలు. ఆ తర్వాత కొత్త రేటుకే కొనాలిగదా. 


2) ఒక కారు యజమాని ఎంత కొంటాడు , ఇరవై లీటర్లు , అంటే 140 రూపాయలు.




ఇది ఒక ప్రాణం కంటే విలువైనదా? ఒక కుటుంబ సమస్య కంటే గొప్పదా? ఒక ఉద్యోగి కష్టము  కంటే పెద్దదా? ఎవరికీ ఏ సమస్య ఉండి ఈ క్యూల వలన వేదన పడుతున్నారో ఆలోచించండి. మనం వ్యక్తిగతముగా ఎంత సమయాన్ని కోల్పోతున్నాము, ఆ రద్దీలో వాహనాలకు నష్టము కలగడము లేదా?

అసలే మనకున్న నెత్తినొప్పులు మనకున్నాయి, తరచుగా వచ్చే ఈ తల నొప్పి కూడా ఎందుకు?


 రోట్లో తల పెట్టి రోకలి పోట్లకు వెరుస్తామా?

 అలాగే వాహనము కొని పెరిగే పెట్రోల్ రేట్లకు భయపడతామా? బాధే సౌక్యమనే భావన రానీవోయి ఆ ఎరుకే నిత్యానందము బ్రహ్మ్హనందము  


ఈ ఆడవాళ్ళను అర్ధం చేసుకోవడము చాలా కష్టం


ఈ ఆడవాళ్ళను అర్ధం చేసుకోవడము చాలా కష్టం

నేను నా స్నేహితుడు ఒక రోజు తెల్లవారు జామున ఇంటికి వెళుతున్నాము.

 నేను అన్నాను " నేను ఇలా ఆలశ్యముగా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను , కారు ఇంజను ముందుగానే  ఆపివేస్తాను, నెమ్మదిగా తలుపులు తీస్తాను , బూట్లు తీసి ముని కాళ్ళ పై నడుచుకుంటూ వెళ్ళి మంచం పై శబ్థం చెయ్యకుండా పడుకుంటాను . అయినా  నా భార్య వెంటనే లేచిపోతుంది " అని అన్నాను.

 దానికి నా స్నేహితుడు " నేను అయితేనా పెద్ద గొడవ చేసుకుంటూ వెళ్ళతాను" అన్నాడు.

 నిజంగానా అని నేను ఆశ్చర్యంగా చూసాను.

వాడు అన్నాడు " కారు హారను పెద్దగా కొడతాను , తలుపులను థడేల్ అని పెద్ద శబ్ధం తో తెరుస్తాను,బూట్ల కాళ్ళను నేలకు గట్టిగా కొడుతూ బెడ్ రూం లోకి వెళ్ళి మంచం మీదికి ఎగిరి దూకి పడుకుంటాను " .

 నేను కళ్ళు పెద్దవి చేసుకుని  మరి  నీ భార్య ఏమీ అనదా? అని అడిగాను.

ఎప్పటి లాగానే నిద్ర నటిస్తుంది అని జవాబిచ్చాడు.
 

Wednesday, 21 March 2012

నా నిజాయితీని మా నాన్న గారు మెచ్చు కున్న విషయం వినండి.

నిజాయితీ 
నా నిజాయితీని మా నాన్న గారు మెచ్చు కున్న విషయం వినండి.


అవి నేను హై స్కూల్ లో చదువుతున్న రోజులు , నా ప్రోగ్రెస్ కార్డ్ లోని మార్కులు చూసి మా నాన్న గారు " నీకు వచ్చిన మార్కులు చూస్తుంటే నాకు ఒక విషయం అర్ధ మౌతుంది, ఇంత దారిద్ర మైన మార్కులు వచ్చాయంటే నువ్వు తప్పకుండా కాపీ మాత్రం కొట్టడం లేదు" అని అన్నారు.


Friday, 16 March 2012

నేను గొప్ప గాయకుడిని అని మీకు తెలుసా?


నిజానికి నా మొదటి కచేరి ఇచ్చే వరకు నాకు తెలియదు. 

 నా అభిమానుల హడావిడి ,వారు నాకు చేసిన సన్మానము చూసి ప్రఖ్యాత గాయకులు శ్రీ బాల మురళి కృష్ణ గారు, శ్రీ జేసుదాస్ గారు మరియు శ్రీ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్యపొయ్యారు. 


అసలు జరిగిన సంగతి ఏమిటంటే ఒక కచేరిలో వారు ముగ్గురు రెండు రెండు పాటల చొప్పున పాడారు,


 తర్వాత నేను ఒక పాట పాడి రెండవ పాట పాడబోతుంటే, నా అభిమానులు స్టేజి మీదకు దూసుకొచ్చారు.


 నాకు దండలు వేసి , శాలువా కప్పారు.


 ఒక అభిమాని మైక్ లాక్కొని మాట్లాడడము మొదలు పెట్టాడు, " మా మట్టుకు మాకు మీరే గొప్ప గాయకులు , మీ లాంటి గాయకులే ఇప్పుడు ఎంతో అవసరము . ఇంత అద్భుతమైన గాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు. నిజానికి మేమందరమూ ఇక్కడ బజ్జీలు, పల్లీలు, టీలు . సోడాలు అమ్ముకునే వాళ్లము. ఇంతకూ ముందు వాళ్ళు పాడినప్పుడు మేము ఒక్కటి కూడా అమ్మలేక పోయ్యాము, కాని మీరు పాడటము మొదలు పెట్టగానే ఒక్కటి గూడా మిగలకుండా అన్ని అమ్మేసుకున్నాము ........

కల చెదిరింది కథ మారింది 
కన్నీరే ఇక మిగిలింది ... కన్నీరే ఇక మిగిలింది